హైదరాబాద్: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 11 వరకు గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటే ‘కోటి వృక్షార్చన’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో శనివారం నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి కోటి వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరించారు.
‘ముక్కోటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణను ఆవిష్కరించిన ఆదర్శ మూర్తి కేసీఆర్. తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా బంగారు మయం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. ఆకు పచ్చ తెలంగాణ సాధన ఆయన లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. 2015లో మొదలు పెట్టిన హరిత హారంలో ఇప్పటి వరకు 230 కోట్ల మొక్కలు నాటామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం 4శాతం గ్రీనరీ పెరిగిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. హరిత హారం కార్యక్రమ విజయవంతానికి ఇది నిదర్శనం అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ప్రపంచ పర్యావరణానికి, మానవ కల్యాణానికి నిర్వహిస్తున్న కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సీఎం టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతా పూర్వక బహుమతిని అందచేద్దాం అని మంత్రి చెప్పారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పాల్గొనాలని పిలుపు నిస్తున్నామని’మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.