వరంగల్ అర్బన్ జిల్లా : కృష్ణవేణిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఈనాడు వారు నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో వరంగల్ జిల్లా మహిళా క్రికెట్ కెప్టెన్‌గా కృష్ణవేణి ఉన్నారు. ఆమె సారథ్యంలో కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్షిప్ కప్‌ను కైవసం చేసుకుని వరంగల్ పేరును క్రికెట్లో అగ్రస్థానంలో ఉంచిన ఆదివాసీ ముద్దుబిడ్డ కృష్ణవేణి అని కొనియాడారు. శనివారం ఆమెను దాస్యం వినయ్‌భాస్కర్ సన్మానించారు. కృష్ణవేణిని సన్మానించుకోవడం యువ క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుందని దాస్యం అభివర్ణించారు. ఆదివాసీల ఆడబిడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన కృష్ణవేణిని ప్రతి ఒక్క యువ క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకొని తమ క్రీడా నైపుణ్యాన్ని పెంపోదించుకోవాలని దాస్యం కోరారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా రాష్ట్రాన్ని ఆకుపచ్చగా తీర్చిదిద్దేందుకు కోటివృక్షార్ఛన కార్యక్రమాన్ని చేపడుతున్నామని దాస్యం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక గంటలోపే కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టామన్నారు. క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకే ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేసినట్లుగా దాస్యం వినయ్‌భాస్కర్ చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ నుంచి రెండు జట్లు చొప్పున ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్నాయని తెలిపారు. కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్ షిప్ లో గెలుపొందిన వారికి మొదటి ప్రోత్సాహక బహుమతిగా రూ .50116 ,రెండో బహుమతిగా రూ. 25116 అందించనున్నట్లు వెల్లడించారు. కోటివృక్షార్ఛన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు.