సీఎంగా కేటీఆర్!..ముహూర్తం ఖరారేనా?

హైదరాబాద్: వచ్చే నెలనే సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం.. ముహుర్తం ఖరారు..? వచ్చే నెలలోనే మంచి ముహుర్తం చూసి ఫిక్స్ చేశారు పురోహితులు.. కేటీఆర్ సీఎం అయితే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఎప్పుడెప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారని టీఆర్ఎస్ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అనే ఆలోచనలు అటు సీనియర్ నేతల్లోనూ, ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ లేవనెత్తుతున్న ప్రశ్నలు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఈ అంశాన్ని ఈ మధ్య చాలామంది సీనియర్ నేతలు తెరపైకి తీసుకువస్తున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 18న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం రెండో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని, కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైందని, ఈ మేరకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని, బ్రాహ్మణ పురోహితులు ముహూర్తం నిర్ణయించారని టీఆర్ఎస్ పార్టీలో చక్కర్లు కొడుతున్న వార్తలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ఈ లోపు కేసీఆర్ యాగాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం కేసీఆర్ నిర్వహిస్తారేని సమాచారం. ఆయాగాలు పూర్తయిన తర్వాత కొడుకుకు పట్టాభిషేకం చేస్తారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి.

తెలంగాణ సీఎం గా కేటీఆర్ అంటూ గత రెండు నెలలుగా కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడు అని బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ అధ్యక్షతన జరగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. యువ నేత కేటీఆర్ ను సీఎం చేయాలని కోరుతున్నాను. కేటీఆర్ ను సీఎం చేయాలని యువ ఎమ్మెల్యేల అభిప్రాయమని షకీల్ స్పష్టం చేశారు.

కేటీఆర్ సీఎం అయితే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెదడ్డి, కేటీఆర్ ను సీఎం చేయాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆలోచించి కేటీఆర్ ను సీఎం చేయాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి కోరారు.ఇక కేటీఆర్ సీఎం అయితే తప్పేముంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తగు సమయంలో నిర్ణయం తీసుకుంటారు. కేటీఆర్ అన్ని విధాలా సమర్థుడు అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై కామెంట్లు చేసే బీజేపీ నాయకులకు బుద్ధి లేదని విమర్శించారు. అవగాహన లేకుండా కాళేశ్వరంపై మాట్లాడుతున్నారని, దమ్ముంటే బీజేపీ నేతలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.