ఏప్రిల్ 1 నుంచి కుంభమేళా

డెహ్రాడూన్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కుంభమేళా జరిగే రోజులను తగ్గించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. కుంభమేళా నిర్వహణకు సంబంధించి మార్చి చివరినాటికి ప్రకటన విడుదల చేయనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు కుంభమేళాను నిర్వహించనున్నారు. ఈ యేడాది కుంభమేళాను కేవలం 30 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఓం ప్రకాష్ గురువారం ఉదయం వెల్లడించారు.

కుంభమేళాకు తరలివచ్చే భక్తులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని, ఈ రిపోర్టులో నెగిటివ్ వస్తేనే కుం‎భమేళాకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్ రిపోర్టు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని తేల్చిచెప్పారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ఘాట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. కుంభమేళాను ప్రతీ పన్నెండ్ సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అయితే కుంభమేళా జనవరి రెండో వారంలో ప్రారంభమై ఏప్రిల్ చివరికి ముగుస్తుంది. కానీ కరోనా నేపథ్యంలో ఈ సారి కేవలం 30 రోజులకే కుంభమేళాను పరిమితం చేశారు.