మానవత్వం చాటుకున్న ఎస్సై

శ్రీకాకుళం జిల్లా : సొంత కుటుంబ సభ్యులు మృతి చెందిన పట్టించుకోని పిల్లలున్న ఈ రోజుల్లో .. ఓ అనాథ మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు ఓ మహిళా ఎస్సై. ఈ సంఘటనపై ఎస్సై స్పందించిన తీరుకు ప్రశంసల వర్షం కురుస్తోంది. జిల్లాలోని పలాస -కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఈ సంఘటన వెలుగుచూసింది.

వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటో వార్డులో ఉన్న అడవి కొత్తూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందుకున్నారు కాశీబుగ్గ ఎస్సై కొత్త శిరీష. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఎస్సై ఆ మృతదేహాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్థించారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో కిలో మీటర్ వరకు మృతదేహాన్ని మోసుకెళ్లారు. స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు బాడీ ని అప్పగించారు. ట్రస్ట్​ నిర్వాహకులు చిన్ని కృష్ణతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీసులు, స్థానికులు మహిళా ఎస్సై మంచి మనస్సును అభినందిస్తున్నారు.