చిరు రీ ఎంట్రీపై జేడీ కామెంట్స్

అమరావతి : మెగాస్టార్​ చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో అది ఎంత మేర ఉంటుందనేది చూడాలన్నారు జేడీ. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి 18 శాతం ఓట్లు, 18 సీట్లు సాధించిన చిరంజీవి ఎంతో కొంత కచ్చితంగా ప్రభావం చూపిస్తారని జేడీ లక్ష్మీనారాయణ అంచనా వేశారు. అయితే ఆయన ఏ విధంగా ముందుకొస్తారు? పార్టీలో చేరతారా? బయట నుంచి మద్దతు పలుకుతారా? ఏ దిశగా వ్యూహరచన ఉంటుందనేది చూడాలన్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఇదో ఇంట్రస్టింగ్ డెవలప్‌మెంట్ అని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వాడివేడి సంవాదం జరుగుతున్న సమయంలో మరో బాంబు పేల్చారు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారని, జనసేనకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారంటూ బాంబు పేల్చారు నాదెండ్ల.

దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌కు కొన్నాళ్లు సినిమాలు చేయమని సలహా ఇచ్చింది కూడా చిరంజీవేనని, 2024 ఎన్నికల నాటికి చిరంజీవి జనసేన పార్టీకి మద్దతు ఇస్తారని ప్రకటించారు నాదేండ్ల మనోహర్​.

మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. చిరంజీవి తమతో మాట్లాడుతూ బీజేపీ – జనసేన కూటమికి 2024 ఎన్నికల్లో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు సోము వీర్రాజు. అయితే అటు జనసేన నేత నాదెండ్ల మనోహర్​ ఇటు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనలతో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం గా మారింది.