ఢిల్లీ లో లేపాక్షి శకటం

అమరావతి : గణతంత్ర దినోత్సవ పరేడ్ కి ఏపీ ప్రభుత్వ లేపాక్షి శకటం ముస్తాబైంది. తెలుగుతనం ఉట్టిపడేలా లేపాక్షి శకటం రూపురేఖలు దిద్దుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడకల్లో ప్రదర్శన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న శకటం సిద్ధమైంది. ఏకశిలపై నిర్మించిన లేపాక్షి ఆలయం, నంది విగ్రహాలను ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రతిపాదన చేసి నమూనాలు పంపగా కేంద్ర రక్షణశాఖ ఆమోదించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం శకటం నిర్మాణం పూర్తి చేసిన కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. అత్యద్భుత నిర్మాణంగా పేరున్న లేపాక్షి ఆలయాన్ని 1583లో కూర్మశైలంగా పేరుగాంచిన ఓ చిన్న రాతికొండను తొలచి నిర్మించారు. లేపాక్షి ఆలయాన్నే మళ్లీ నిర్మించారా అన్న రీతిలో శకటాన్ని సైతం కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. దేశంలోనే అతిపెద్ద ఏకశిల నంది విగ్రహం ముందు భాగంలో, ఆ వెనుక ఆలయం ఉండేలా శకటం రూపుదిద్దుకుంది. ఈ ఆలయంలో భాగంగా ముఖ మండపం, అర్థ మండపం, అంతరాలయం, గర్భ గృహం ఉన్నాయి. అలాగే కళ్యాణ మండపం కూడా ఆలయంలో భాగంగా ఉంటుంది.