మార్చి8 కి లోక్‎సభ వాయిదా

న్యూఢిల్లీ: ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో తొలిదశ ముగిసింది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్‎పై సాధారణ చర్చ ముగియడంతో రాజ్యసభను మార్చి 8కి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. మార్చి 8న ఉదయం 9 గంటలకు రాజ్యసభలో రెండో దశ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయని పేర్కొన్నారు. తాజాగా లోక్‎సభలో కూడా బడ్జెట్‎పై చర్చ ముగియడంతో మార్చి 8న సాయంత్రం 4 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.

నేడు సభ ప్రారంభం కాగానే మొదటగా బడ్జెట్‎పై చర్చ కొనసాగింది. చర్చ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సభకు సమాధానం ఇచ్చారు. ‎ఆ తర్వాత ప్రభుత్వం జమ్ముకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లు-2021ని సభలో ప్రవేశపెట్టింది. బిల్లుపై సుధీర్ఘ చర్చ అనంతరం లోక్‎సభ ఆమోదముద్ర పడింది. అనంతరం సభను మార్చి 8కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.