త్వరలో దేశవ్యాప్తంగా కళ్యాణమస్తు

తిరుమల : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా త్వరలో కళ్యాణమస్తు కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం చెన్నైలో శంఖుస్థాపన చేసిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ఏడాదిన్నరలో పూర్తి చేయడం లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. తర్వాత గుడికో గోమాత ప్రారంభ కార్యక్రమాల్లో చైర్మన్ పాల్గొన్నారు.

అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో పెళ్లి ఖర్చులకు బాధపడే పేద కుటుంబాలకు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో వివాహాలు జరిపించడానికి టీటీడీ దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో కళ్యాణమస్తు నిర్వహించనుందన్నారు. మంచి ముహూర్తం నిర్ణయించి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.

వివాహాలు చేసుకునే వధూవరుల జంటకు పట్టు వస్త్రాలు, మంగళ సూత్రాలు ఇవ్వడంతో పాటు వివాహ విందు భోజనం కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసంలో ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో అమలవుతోందని అన్నారు.