న్యాయవాదికి తప్పిన ప్రమాదం

జనగామ జిల్లా : కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో న్యాయవాది దంపతుల హత్య మరువక ముందే జనగామ జిల్లా సమీపంలో మరో ఘటన జరిగింది. జనగామ జిల్లా యశ్వంతాపూర్ సమీపంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఓ న్యాయవాది కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ జనగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‎కు చెందిన దుర్గాప్రసాద్ ఓ భూ వివాదం కేసును వాదించేందుకు వరంగల్ కోర్టుకు తన కారులో బయల్దేరారు. జనగామ మండలం యశ్వంతాపూర్ వద్దకు రాగానే లారీ వెనుక నుంచి వచ్చి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారును లారీ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అయితే న్యాయవాది మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. తన ప్రాణాలకు హాని కల్గించేందుకు దుండగులు ఈ దాడికిక పాల్పడినట్లు దుర్గా ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటన అనంతరం స్థానికులు లారీ డ్రైవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. లారీ బ్రేకులు విఫలం కావడంతోనే ప్రమాదం జరిగినట్లు లారీ డ్రైవర్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.