కల్నల్ సంతోష్‎కు మహావీర చక్ర

న్యూఢిల్లీ : గత యేడాది చైనా సైనికులతో లడఖ్ వద్ద సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. కల్నల్ సంతోష్ బాబు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట వాసి. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు రోజు సోమవారం కేంద్రప్రభుత్వం 119 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు, ఏడుగురికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ , గుజరాత్ మాజీ సీఎం కేశూభాయి పటేల్, కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, సినీ నేపథ్య గాయకురాలు చిత్రలను పద్మభూషన్ లతో గౌరవించింది.

102 మంది పద్మ శ్రీ పురస్కారాలు అందుకోనున్నారు. ఇందులో కళా రంగానికి చేసిన సేవలకు గాను తెలంగాణకు చెందిన కనకరాజుకు పద్మ శ్రీ పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్నవరపు రామస్వామి, ఏ ప్రకాష్ రావు, ఎన్ సుమతిలు పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరికి త్వరలో రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ పురస్కారాలను ప్రధానం చేస్తారు.