‘రైతు బంధు’ సాయం పెంపు


కోల్‎కతా: ఆర్థికశాఖను తన ఆధీనంలో ఉంచుకున్న సీఎం మమత రూ.2.99 కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ లో పలు వర్గాల ప్రజలకు వరాలిచ్చారు. ఈ నేపథ్యంలో రైతు బంధు సహాయం కింద ఇచ్చే నగదును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పెంచింది. ఆ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న క్రిషక్ బంధు పథకం భత్యాన్ని సీఎం మమతాబెనర్జీ పెంచారు. బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే రైతు బంధు వార్షిక సహాయాన్ని పెంచారు. రూ.1500 కోట్లతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 20 లక్షల పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో కోల్‎కతా పోలీస్ ఫోర్స్‎లో నేతాజీ బెటాలియన్ ఏర్పాటు చేస్తామని మమత చెప్పారు. పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించే పథకం కోసం వంద కోట్లు కేటాయించారు. పలు కొత్త రోడ్డు, వంతెన ప్రాజెక్టులకు మధ్యంతర బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ‘నాపై విశ్వాసం ఉంచండి. నేను మీకు చాలా అంకితభావంతో బేషరతుగా నిస్వార్థ సేవలు అందిస్తాను’ అన్న రవీంద్రనాథ్ ఠాగోర్ కోట్ తో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.