లాక్ డౌన్ పై నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారంటూ నకిలీ ఉత్తర్వులు తయారు చేసి, జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మీడియాకు వివరించారు. 4 రోజుల క్రితం శ్రీపతి సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను తయారు చేసినట్లు తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో రాత్రి వేళల్లో లాక్‌ డౌన్‌ విధిస్తారంటూ నకిలీ జీవో తయారు చేసి, సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్‌ చేశారన్నారు. నిందితుడి నుంచి ఓ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడని, ఆయన స్వస్థలం నెల్లూరు టౌన్‌ అని సీపీ వివరించారు.

ads

లాక్‌డౌన్‌పై గతంలో ఇచ్చిన జీవోను డౌన్‌లోడ్‌ చేసుకొని, తేదీలు మార్చి పాత జీవోను సంజీవ్‌, అతని స్నేహితులు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రధానంగా వాట్సాప్‌ గ్రూపుల్లో అడ్మిన్స్‌గా ఉన్నవారంతా నిజనిర్ధారణ చేసుకున్న తర్వాతనే సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేయాలని సూచించారు. లేదంటే వారిపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.