వివాదంపై ఫస్ట్ టైం స్పందించిన మంగ్లీ

హైదరాబాద్ : బోనాల పండుగ పాటపై కొనసాగుతోన్న తీవ్ర వివాదంపై సింగర్ మంగ్లీ తొలిసారి స్పందించారు. నన్ను, నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం నేడు పాడిన బోనాల పాట గురించి చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత, గాయకులు, 80 యేండ్లు కల్గిన పెద్దాయన పాలమూరు రామస్వామి 25 యేళ్ల క్రితమే రచించారు. పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ధి. 2008లో ఈ పాటను డీఆర్సీ ఆడియో సంస్థవారు సీడీ రూపంలో కూడా విడుదల చేశారు.

ads

ఆ పెద్దాయన రాసిన జానపదాలు నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో స్వయాన ఆయన్ని కలిసి ఈ పాటను తీసుకున్నామని మంగ్లీ తెలిపింది. ఈ పాట వీడియోలో రామస్వామిని కూడా చిత్రీకరించాం. 300 జానపదాలతో పాటు గ్రామదేవత మైసమ్మ మీద ఆయన వంద కోలాటం పాటలు రచించారు. ఆ పాటన్నీ నిందాస్తుతిలోనే ఉన్నాయి.

“చెట్టుకింద కూసున్నవమ్మ చుట్టం లెక్క ఓ మైసమ్మ ” అని సాగే ఈ పాటలో ‘మోతెవరి’ అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రచయిత రామస్వామి అభిప్రాయం మేరకు ‘మోతెవరి’ అంటే గ్రామంలో ‘పెద్ద’ అని అర్థంలో పాట సాగుతుందని తెలిపారు. ఇక గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల్ల కొలుపులు ఇలా రకరకాల ఆచారాలున్నాయని అన్నారు. భక్తిలో కూడా మూఢ భక్తి, వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించినట్లు మంగ్లీ తెలిపారు.

ఇక సోషల్ మీడియాలో తనపై కామెంట్లు చేస్తున్న వారిపై మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఏనాడు గుడికి వెళ్లని వాళ్లు, బోనం ఎత్తని వాళ్లు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమో గమనించాలని అన్నారు. ఈ పాటపై విమర్శలు వచ్చినరోజే పాటను మార్చే అవకాశం ఉన్నప్పటికీ, పాటకోసం ప్రాణం పెట్టిన రచయిత రామస్వామిని తక్కువ చేయొద్దనే ఉద్దేశ్యంతో, ఆయన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకోలేకపోయాను. కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ని కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబసభ్యుల అనుమతితో లిరిక్స్ లో మార్పులు చేశాం” అని సింగర్ మంగ్లీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటన చేశారు.