సాగర్ ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్

నల్గొండ జిల్లా : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. ఉపఎన్నికలో ఓటు వేసేందుకు తరలిరావడంతో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 81.5శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసినా తుది పోలింగ్ శాతం వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల వరకు మందకొడిగా సాగినా ఆ తర్వాత ఊపందుకుంది. 5 గంటల తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరి కనిపించారు.

ads

దీంతో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశముందని అంచనా, మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను, కంట్రోల్ యూనిట్లను, వీవీప్యాట్లను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్విచ్ ఆఫ్ చేశారు. కేటాయించిన రూట్లలో రూట్ ఆఫీసర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు పోలీస్ బందోబస్తు నడుమ నల్గొండ జిల్లా కేంద్రాలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే2న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాన్ని ప్రకటిస్తారు. కరోనా నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ ) పోలింగ్ సమయాన్ని రెండు గంటలపాటు పొడిగించింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది బరిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ తరుపున నోముల భగత్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ బరిలో నిలిచారు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశముంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 2,20,300 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,09,228 మంది పురుషులు , 1,11,072 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.