మినీ మేడారంకు వేళాయే..

ములుగు జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లకొకసారి అంగరంగవైభవంగా జరిగే మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి పొందింది. మేడారం మహా జాతర వచ్చిందంటే చాటు మేడారం ప్రాంతం జనసంద్రమౌతుంది. కోట్లాదిమంది భక్తులు మహాజాతరలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ జాతరను నిర్వహించిన మరుసటి యేడాది మేడారం చిన్న (మినీ ) జాతర ప్రారంభమవుతుంది. 2020, ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం మహాజాతర జరుగగా, ఈ యేడాది 2021, ఫిబ్రవరి 24 న మేడారం మినీ జాతర ప్రారంభంకానుంది. అయితే జాతరకు వారం రోజుల ముందు గిరిజనులు తమ ఆచారం ప్రకారం మండమెలిగే పండుగను చేస్తారు. ఫిబ్రవరి 17న మండమెలిగే పండుగతో ప్రారంభమైన మేడారం మినీ జాతరకు ఇప్పటికే భక్తులు పోటెత్తారు.

గిరిజనులు, ఆదివాసీల జాతరగా మొదలై, సకల జనుల ఆరాధ్య దైవంగా రూపుదిద్దుకున్నజాతర మేడారం. శక్తివంతమైన కాకతీయ సామ్రాజ్యంతో పోరాటాన్ని నడిపి, వీరమరణం పొందిన గిరిజనుల పౌరుషానికి ప్రతీక. రెండేళ్ళకు ఒకసారి మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ జాతరను నిర్వహిస్తారు. జాతర ప్రారంభానికి వారం రోజుల ముందు మండగెలిగే పండుగతో శ్రీకారం చుడతారు. మహా జాతర కోసం మేడారంలోని గద్దెల మీదకు వనం నుంచి సమ్మక్క, సారలమ్మ దేవతలు తరలివస్తారు. చిన్న జాతరలో మాత్రం సమ్మక్క, సారలమ్మ ఆలయాల దగ్గరే పూజలు జరుపడం ఆనవాయితీ.

ఈ యేడాది ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు మేడారం చిన్న జాతర జరుగనుంది. తొలిరోజైన ఫిబ్రవరి 24, బుధవారం ఆలయ శుద్ధితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గ్రామాల్లోకి దుష్టశక్తులు రాకుండా దిగ్భంధనం చేస్తారు. ధ్వజ స్తంభాలను ప్రతిష్ఠిస్తారు. అమ్మవార్ల గద్దెలను పూలతో, జాతర జరిగే ప్రాంతాన్ని మామిడి ఆకుల తోరణాలతో అలంకరిస్తారు. రెండవ రోజైన గురువారం అమ్మవార్లకు మహిళలు పసుపు, కుంకుమలను అందచేసి, పూజలు చేస్తారు. మూడవ రోజైన శుక్రవారం అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. నాల్గవ రోజు శనివారం పౌర్ణమి రోజు మినీ జాతర ముగుస్తుంది. గిరిజన ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగే మేడారం మహాజాతర మాదిరిగానే మినీ జాతరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తారు. ఇందులో భాగంగానే మేడారం మినీ జాతరకు వారం రోజుల నుంచే భక్తుల రద్దీ పోటెత్తింది. భక్తులు అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.