ముగిసిన మినీ మేడారం జాతర

ములుగు జిల్లా : ఫిబ్రవరి 24న ప్రారంభమైన మేడారం మినీ జాతర శనివారం ముగిసింది. మినీ మేడారం జాతర ముందు నుంచే వనదేవతలు సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాస, గిరిజన భక్తులతో పాటు గిరిజనేతరులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు రోజుల పాటు గిరిజన సంప్రదాయంలో జరిగిన మినీ మేడారం జాతర చివరి రోజు మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తల్లుల గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. సమ్మక్క,సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై నిలువెత్తు బంగారంతో పాటు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ads

వనదేవతలకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమి రోజున అమ్మవార్ల మహాజాతరతో పాటు మినీ జాతరను పూజారులు నిర్వహిస్తారు. ఈ సారి తేదీలు కుదరలేదు. జాతర ముగింపు రోజు శనివారం మాఘశుద్ధ పౌర్ణమి వచ్చింది. దీంతో పూజారులు అమ్మవార్ల మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ధూపదీప నైవేద్యాలు స మర్పించారు. మండమెలిగే పండుగ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ పూజారులు గద్దెల వద్ద ఉంచిన అమ్మవార్ల పూజాసామాగ్రిని మందిరాల్లోకి తీసుకుపోవడంతో మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ తల్లులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.