అభిమానికి మెగా సాయం

హైదరాబాద్​: ఆపదలో ఉన్నవాళ్లను రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది. కష్టాల్లో ఉన్నానని ఆయన తలుపు తడితే చాలు.. వెంటనే ఆపన్నహస్తం అందించే మెగా మనసున్న మనిషి మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే చిరంజీవి ఐ, అండ్ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో సేవలందిస్తున్నారు. తాజాగా అనారోగ్యంతో బాధ పడుతున్న అభిమాని వెంటనే కోలుకోవాలంటూ బాధితుడి మెగాస్టార్ లక్ష రూపాయల సాయం అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

వైఎస్సార్​ కడప జిల్లాకు చెందిన సీనియర్ మెగా అభిమాని పీ సురేష్ అంటే తెలియని మెగాభిమానులుండరు. అఖిల భారత చిరంజీవి యువతకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన కడప జిల్లా మాజీ అధ్యక్షుడిగా ఎనలేని సేవలు చేశారు. మెగాస్టార్ చిరంజీవింటే ఆయన ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తారు. చిరంజీవి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం సురేష్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ కదిరిలో ఉంటున్నారు. చికిత్స నిమిత్తం ప్రతి రెండు రోజులకోసారి కదిరి నుంచి కడప, తిరుపతి వెళ్లి వస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో, ఆర్థికంగా సతమతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్​ సురేష్ కి సాయం అందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మెగాస్టార్. గురువారం మధ్యాహ్నం పీసురేష్ అకౌంట్ కు లక్షరూపాయలను ట్రాన్స్​ఫర్​ చేశారు.

కరోనా సమయంలో కూడా చిరు ఎందరో అభిమానులకు తనదైన సపోర్ట్ అందించారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత మెగాస్టార్ చిరంజీవికి కృతఙ్ఞతలు తెలిపారు.