ఎస్సీల‌కు క‌ల్ప‌త‌రువుగా మినీ డెయిరీ

వరంగల్ రూరల్ జిల్లా : ఎస్సీల‌కు క‌ల్ప త‌రువుగా మినీ డెయిరీ పైల‌ట్ ప్రాజెక్టు ప‌ని చేస్తున్న‌ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా న‌ర్సంపేట‌ వ్యవసాయ మార్కెట్ లో ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డితో క‌లిసి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ ఎస్సీ ల‌బ్ధిదారుల‌కు మినీ డెయిరీ పైల‌ట్ ప్రాజెక్టు కింద రూ.17.40 కోట్ల విలువైన 435 పాడి గేదెల‌ను పంపిణీ చేశారు. ఇందులో రూ.10.44 కోట్ల సబ్సిడీ ల‌భించ‌నున్న‌ట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఒక్కో ప్రాజెక్టు విలువ రూ.4 ల‌క్ష‌లు కాగా, ప్ర‌తీ ల‌బ్ధిదారుడికి 4 పాడి గేదెల‌ను ఇస్తార‌న్నారు. 4 ల‌క్ష‌ల లోనులో రూ.2.40ల‌క్ష‌ల స‌బ్సిడీ ల‌భిస్తుండ‌గా, కేవ‌లం రూ.1.60 లోలు మాత్ర‌మే రుణంగా ఉంటుంద‌న్నారు. మినీ డెయిరీ పైల‌ట్ ప్రాజెక్టుని అద్భుతంగా తీర్చిదిద్దిన‌ట్లు చెప్పారు. ఇప్పుడు స‌బ్సిడీపై ఇచ్చే పాడిగేదెల ద్వారా వ‌చ్చే పాల‌ను ప్ర‌భుత్వ సంస్థ విజ‌య డెయిరీ తీసుకుంటుంద‌ని, ఒక్కో లీట‌ర్ పాల‌కు అద‌నంగా రూ.4ని ప్రోత్సాహ‌కంగా ఇస్తుంద‌ని మంత్రి లబ్ధిదారులకు వివరించారు. రైతుల‌కు రావాల్సిన డ‌బ్బుల‌ను విజ‌య డెయిరీ వారి ఖాతాల్లో వేస్తుంద‌ని, క్రమేణా వారి రుణం కూడా తీరిపోతుంద‌ని అన్నారు. ఆ త‌ర్వాత ఆ పాడితో వ‌చ్చేదంతా లాభ‌మేన‌న్నారు. అయితే ల‌బ్ధిదారులు ఒక సొసైటీలా ఏర్ప‌డాల‌ని, ఆ సొసైటీని విజ‌య డెయిరీకి అనుసంధానిస్తార‌ని చెప్పారు. ఈవిధంగా ఒక్కో కుటుంబం నెల‌కు 15వేల నుంచి 20 వేల వ‌ర‌కు సంపాదించ వ‌చ్చ‌ని మంత్రి తెలిపారు.

తాను రైతు బిడ్డగా, ఇలాంటి ప‌థ‌కాన్ని గ‌తంలో ఎన్నడూ చూడ‌లేద‌ని మంత్రి ఎర్రబెల్లి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పైల‌ట్ ప్రాజెక్టు మినీ డెయిరీ ప్రాజెక్టుని ప్ర‌భుత్వం ప్రారంభించడం గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 2084 మంది ల‌బ్ధిదారులకు రూ.80 కోట్ల విలువైన పాడిగేదెల పంపిణీ జ‌రుగుతున్న‌ద‌ని, ఇందులో రూ.50 కోట్ల మేర స‌బ్సిడీ ల‌భిస్తున్న‌ద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో 611 మంది ల‌బ్ధిదారుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. 26సొసైటీల ద్వారా 72 పాల‌కేంద్రాల‌‌ను ఏర్పాటు చేశామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రైతుల‌కు చెప్పారు. ప‌థ‌క‌మేదైనా తన నియోజకవర్గం న‌ర్సంపేట‌కు ఎక్కువ ల‌బ్ధి చేకూరే విధంగా ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి కృషి చేస్తున్నార‌ని మంత్రి అభినందించారు.రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పునరేకీకరణ జరిగిందని, అలాగే పూర్వ వైభవం దక్కే విధంగా, అన్ని కుల సామాజిక వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని రాష్ట్ర ఎస్సీ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సంప్రదాయబద్ధమైన మన గ్రామీణ వ్యవస్థ పురోభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారని మంత్రి ఈశ్వర్ వివరించారు. మినీ డెయిరీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు.

సిఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీల‌కు పూర్తి అండ‌గా ఉంద‌ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ‌, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కే కాదు, అగ్ర కులాల‌కు సైతం పెద్ద పీట వేస్తూ అంద‌రినీ స‌మానంగా ఎదిగే అవ‌కాశాలు క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. పాడి గేదెల ప‌థ‌కం ఎస్సీల‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టుని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ల‌బ్ధిదారుల‌కు మంత్రి స‌త్య‌వ‌తి విజ్ఞ‌ప్తి చేశారు.

మినీ డెయిరీ ప‌థ‌కం రైతాంగానికి ఎంతో లాభ‌దాయ‌కంగా ఉంద‌ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప‌థ‌కం కింద వ‌చ్చే నిధితోపాటు, సబ్సిడీ కూడా బాగా ఉంద‌ని, త‌ద్వారా రైతులు లాభ ప‌డే విధంగా ఈ ప‌థ‌కాన్ని రూపొందించార‌ని చెప్పారు. రైతులు ఈ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకుని లాభ ప‌డాల‌ని ఆయన సూచించారు.

ప‌థ‌కాలేవైనా ల‌బ్ధిదారులు స‌ద్వినియోగం చేసుకున్న‌ప్పుడే వాటికి సార్థ‌క‌త ఏర్ప‌డుతుంద‌ని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. ప్ర‌జ‌లు బాగుపడాల‌నే ల‌క్ష్యంతోనే ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను రూపొందించి అమ‌లు చేస్తుందన్నారు. అలాంటి వాటిలో ఈ మినీ డెయిరీ ప్రాజెక్టు ఒక‌ట‌ని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత ల‌బ్ధిదారుల‌కు శుభాకాంక్ష‌లు అంద‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ మాలోతు కవిత, రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, విజ‌య డెయిరీ సంస్థ‌ అధికారులు, ఎస్సీ కార్పొరేష‌న్, వివిధ విభాగాల అధికారులు, ల‌బ్ధిదారులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.