గ్రామాల్లో దాతలకు కొదవలేదు

జనగామ జిల్లా : పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. గ్రామంలో సర్పంచ్ కొమురయ్య జెండా ఆవిష్కరణ చేయగా మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గూడూరులో గ్రామస్తులు, మోక్ష ధర్మ హిందూ స్మశాన వాటిక ట్రస్ట్, వీధి భాగవతం కళాకారుల బృందం, స్థల, వాహన, ఫ్రీజర్ దాతల సహకారంతో పూర్తి చేసిన వైకుంఠ దామాన్ని, కొందరు దాతలు అందచేసిన పరమపద వాహనాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఆ తర్వాత అదే గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలమే స్వాతంత్ర్యం అని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవిరళకృషి, అనన్య సామాన్యమైన మేధా సంపత్తి ఫలితంగా మన రాజ్యాంగం ఏర్పడిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యాంగం స్పూర్తి, అంబేద్కర్ ఆశయ సాధన లో భాగంగానే సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆదిశగానే గ్రామాల అభివృద్ధి కోసం ప్రతినెల రూ.308 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. దీంతో గ్రామాల అభివృద్ధి కి నిధుల కొరత లేకుండా పోయిందని మంత్రి వివరించారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రైతులకు వరం. రైతులకు సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‎దేనని మంత్రి తెలిపారు.మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలి. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎర్రబెల్లి దయాకర్ వివరించారు.

జనగామ జిల్లాలోనే మొదటి వైకుంఠ ధామం గూడూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. వైకుంఠధామం ని ఆదర్శంగా తీర్చిదిద్దిన సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామస్తులను మంత్రి అభినందించారు. ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన నిర్మాణాలకు తోడుగా గ్రామస్తుల సహకారంతో సర్వాంగసుందరంగా నిర్మితమైన గూడూరు వైకుంఠధామం మొత్తం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి వారిని అభినందించారు. మనసుంటే మార్గం ఉంటుంది అని, గ్రామాల్లో దాతలకు కొదవలేదని, చొరవ తీసుకునే వారు ఉంటే ఎలాంటి కార్యాన్నైనా సాధించే వీలు ఉందని చెప్పడానికి నిదర్శనమే గూడూరు వైకుంఠధామం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. వైకుంఠ ధామానికి సహకరించిన వాళ్లని మంత్రి అక్కడే సత్కరించారు. అంతకుముందు మంత్రికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో లో గ్రామదర్శినిలు, మండల స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.