సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్ర‌బెల్లి కృత‌జ్ఞ‌త‌లు


వరంగల్ అర్బన్ జిల్లా : వ‌రంగ‌ల్ లోని కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో 250 ప‌డ‌క‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో అన్ని వ‌స‌తులు క‌ల్పించి, అవ‌స‌ర‌మైన సిబ్బంది నియామ‌కం చేపట్టి, త‌క్ష‌ణ‌మే పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు నిధులు విడుద‌ల చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయ‌డం ప‌ట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సీఎం కేసిఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రికి రాష్ట్ర ప్ర‌భుత్వ వాటా కింద‌ 8 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేయాల‌ని, 363 మంది డాక్ట‌ర్లు, పారామెడిక‌ల్ సిబ్బంది నియ‌మించాల‌ని ఆదేశించిన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితుల్లో కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల వ‌రంగ‌ల్ స‌మీప జిల్లాల్లోని నాన్ కోవిడ్ రోగుల‌కు కార్పోరేట్ స్థాయిలో వైద్య సదుపాయాల ల‌భిస్తాయ‌ని మంత్రి తెలిపారు. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌గా ప‌నిచేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డాక్ట‌ర్లకు, పారామెడిక‌ల్ సిబ్బందికి ప‌ని ఒత్తిడి త‌గ్గించ‌డానికి సీఎం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయడం గొప్ప విషయమని అన్నారు.

ads

రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలికంగా 2 నుంచి 3 నెల‌ల కాలానికి దాదాపు 50వేల మంది యం.బి.బి.య‌స్ పూర్తి చేసి సిద్దంగా ఉన్న అర్హులైన వైద్యుల‌తో పాటుగా న‌ర్సుల‌ను, ల్యాబ్ టెక్నిషియ‌న్‌లు, ఫార్మాసిస్టులు, ఇత‌ర పారా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కాలు చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశాలు జారీచేయ‌డం ప‌ట్ల మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ‌రంగ‌ల్ లోని కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో 150 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో ఇటీవ‌ల తాత్కాళికంగా ఓ.పి సేవ‌ల‌ను ప్రారంభించామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. వ‌రంగ‌ల్‌లోని యం.జి.యం ఆసుప‌త్రిని పూర్తి స్థాయిలో కోవిడ్ సేవ‌ల‌కు వినియోగిస్తున్నందు వ‌ల్ల కే.యం.సి సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిని నాన్ – కోవిడ్ సేవ‌ల‌కు వినియోగించ‌నున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు.