ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం

హైదరాబాద్ : తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. భూ కబ్జా ఆరోపణలపై మంత్రి మీడియా సమావేశం ద్వారా వివరణ ఇచ్చారు. 1986 నుంచి తాను హేచరీస్ పరిశ్రమలో ఉన్నట్లు తెలిపారు. పౌల్ట్రీకి ల్యాండ్ ఎక్కువగా కావాల్సినందున విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు లేఖ రాశా. కెనరా బ్యాంక్ ద్వారా వంద కోట్ల రుణాలు తీసుకున్నామని పేర్కొన్నారు. అది వ్యవసాయ భూమి కాదు, స్వచ్ఛంధంగా సరెండర్ చేస్తే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వచ్చని చెప్పారు.

ads

ఒక ఎకరం కూడా నా స్వాధీనంలో లేదు. నా మొత్తం చరిత్ర మీద విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. భూములు కోల్పోయినా పర్వాలేదు. ఆత్మగౌరవాన్ని అమ్ముకోను అని ఈటెల తెలిపారు. సీఎస్, విజిలెన్స్ విచారణతో పాటు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయాలి, నా ఆత్మగౌరవం కంటే పదవి గొప్పది కాదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ఈటల స్పష్టం చేశారు.