ఎల్ఎండి గేట్లను ఎత్తివేసిన మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లా : లోయర్ మానేర్ జలాశయం (ఎల్ ఎం డి) గేట్లను ఎత్తివేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం సాయంత్రం గేట్లను ఎత్తారు. ఎల్ ఎం డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగడంతో గేట్లను ఎత్తడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మానేర్ వాగు, ఎస్సారెస్పీ, మిడ్ మానేర్ నుండి ఎల్ ఎం డి కి నీటి తాకిడి పెరగడంతో గేట్లు ఎత్తడం విషయమై అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ads

ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో మంత్రి గంగుల కమలాకర్ 11 వ గేట్ ని ఎత్తారు. సాయంత్రం 5 నుండి 16 నంబర్ల వరకు గేట్లను ఎత్తి 60వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఎల్ ఎం డి లో సాయంత్రం వరకు 22టీఎంసీల నీరు ఉండగా… లక్షా 20 వేల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటి ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల ఎత్తడం, తగ్గించడం ఉంటుందన్నారు.

గత ఏడాది ఆగస్టు 22 న నీటిని విడుదల చేయగా ఈసారి నెల ముందే విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ రావు, మేయర్ సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం,
కార్పొరేటర్లు, నాయకులు, హరిశంకర్, జయశ్రీ , పాల్గొన్నారు.