ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నేడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి, గతంలో ఓ మహానుభావుడు చెప్పినట్లే తాను నేడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ కు మొక్కి ఓటేసేందుకు బయలుదేరానని వ్యాఖ్యానించారు. అయితే మంత్రి కేటీఆర్ మహానుభావుడిగా ఉటంకించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీయేనని జనంలో చర్చ జరుగుతున్నది.

ads

ఎందుకంటే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆనాడు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను దృష్టిలో పెట్టుకుని అప్పటి యూపీఏ సర్కారుకు కౌంటర్‎గా ఇంట్లో సిలిండర్‎కు మొక్కి వస్తున్నానని ప్రధాని మోడీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని మాటలనే బీజేపీపై వ్యంగ్యాస్త్రంగా ప్రయోగించారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకున్న కొందరు, తమ ఇండ్లలో గ్యాస్ సిలిండర్లకు పూజలు చేస్తున్నట్లుగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‎గా మారుతున్నాయి.