ఫ్లోరైడ్​ బాధితుడికి నెరవేరిన కల

నల్గొండ జిల్లా : ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన నల్గొండ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి సొంత ఇల్లు చేకూరనుంది. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (హెయిర్ కటింగ్ సెలూన్) ని ఏర్పాటు చేయించిన మంత్రి కేటీఆర్​ ఈరోజు అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లుని అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. శుక్రవారం పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ కు అంశాల స్వామికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

కేటీఆర్​ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన సొంత ఊరు పరిసర గ్రామ నివాసి అయిన అంశాల స్వామికి పక్కా ఇల్లు అందించేందుకు విద్యాసాగర్ ముందుకొచ్చారు. ఈమేరకు అంశాల స్వామి మంత్రి కేటీఆర్ ని ప్రగతిభవన్​లో కలిశారు. ఈ సందర్భంగా అంశాల స్వామికి సంబంధించిన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్​.  ఆయనకు పక్కా ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి భరోసా ఇచ్చారు. స్వామి ఇల్లు నిర్మాణం పూర్తయ్యేంత వరకు సంపూర్ణ బాధ్యత తీసుకోవాలని విద్యాసాగర్ కి సూచించారు. అంశాల స్వామికి సొంత ఇంటి నిర్మాణ బాధ్యత తీసుకొనేందుకు ముందుకు వచ్చిన విద్యాసాగర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు.

గతంలో సెలూన్​ షాపు , ఇప్పుడు తన సొంత ఇంటి కల నెరవేర్చుతున్నందుకు అంశాల స్వామి మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్య నుంచి క్రమంగా విముక్తి లభిస్తుందని స్వామి అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతానని స్వామి చెప్పారు.