మహా శివరాత్రికి మంత్రి మాస్టర్ ప్లాన్

సంగారెడ్డి జిల్లా : శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి జాతరను కన్నుల పండువగా నిర్వహించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‎లోని అరణ్య భవన్‎లో సంగారెడ్డి జిల్లాలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్న జాతరను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.దేవాదాయ శాఖ ఆమోదించిన కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా పనుల వేగంపెంచాలని మంత్రి హరీశ్ రావు జిల్లా దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను సమీక్షించిన మంత్రి రూ.13 కోట్లతో 36 ఎకరాల్లో కళ్యాణ మండపం, కళ్యాణ కట్ట, వాహన పార్కింగ్ ఇలా అన్ని హంగులతో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

ads

దేవాలయ మాస్టర్ ప్లాన్‎లో తొలి దశలో ఏ పనులు చేపట్టాలి, రెండో దశలో ఏ పనులు చేపట్టాలన్న అంశాలను ప్రణాళికాబద్దంగా తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ ఆధ్వర్వంలో దేవాలయ కమిటీ పనుల ప్రాధాన్యత మేరకు ఏ పనులు ముందు చేపట్టాలో నిర్ణయించి ముందుకు సాగాలన్నారు. సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఒక్కో సబ్ కమిటీకి ఒక్కో బాధ్యత చేపట్టి పనులు వేగవంతం అయ్యేటట్లు చూడాలన్నారు. దేవాలయ ఖజానాలో ఉన్న 127 కిలోల వెండి, 1.7 కిలోల బంగారాన్ని దేవాలయ ద్వారం లేదా అమ్మవారికి నగలు, కిరీటం, అమ్మవారి ముక్కుపుడక వంటి ఆభరణాలు తయారు చేసే దిశగా ఆలోచించాలన్నారు. దీని వల్ల దేవాలయ ప్రాశస్త్యం పెరుగుతుందని మంత్రి చెప్పారు. గోశాల నిర్మాణ పనులు వేగంగా జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు . గోవుల షెడ్లు, పని చేసే వారికి గదులు, గడ్డి, దాాణా వంటి వాటిని నిలువ చేసేందుకు నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే కొద్ది మంది దాతలు నిర్మాణ పనులకు విరాళాలు ప్రకటించారని, వారిని సంప్రదించి పనులు వేగంగా చేయాలన్నారు. మహాశివరాత్రి జాతరలోగా గోశాల ప్రహరీ నిర్మాణం పూర్తి చేస్తామని దేవాలయ పాలకమండలి సభ్యులు మంత్రికి చెప్పారు.

జరాసంఘం గ్రామం ప్రారంభం నుండి దేవాలయ ముఖ ద్వారం వద్దకు 2 కిలోమీటర్ల 4 లైన్ రోడ్ కు ఎంపీ నిధుల నుండి నిర్మిస్తున్నామన్న మంత్రి హరీశ్ రావు, ఈ పనులు వేగంగా జరపాలని ఆర్ అండ్ బి అధికారులను ఫోన్లో ఆదేశించారు. ఫుట్ పాత్, డివైడర్లు, బటర్ ఫ్లై లైటింగ్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయ ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాలని పాలకమండలి సభ్యులకు, ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు. దేవాలయ సిబ్బందిలో జవాబుదారీతనం పెంచాలన్నారు.