అభివృద్ధిలో సీఎం దేశానికే ఆదర్శం

హైదరాబాద్​: తెలంగాణ అభివృద్ధిలో సీఎం కేసీఆర్​ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సుపరిపాలనను అందిస్తున్న పాలనా దక్షుడు సీఎం కేసీఆర్​ అని స్పీకర్​ పోచారం కొనియాడారు. బుధవారం నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సభలో సీఎం కేసీఆర్​ బాల్యం, విద్య, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నేపథ్యాన్ని వివరించేలా త్రీడీ గ్రాఫిక్స్ ను రూపొందించారు. బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో 30 నిమిషాల వ్యవధి కలిగిన డాక్యుమెంటరీ లో( నువ్వే ఒక చరిత్ర ), కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే పాటలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు విడుదల చేశారు. అనంతరం ఎల్​సీడీ స్క్రీన్ పై వీక్షించారు. దీనికి కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అభినందనలు తెలిపారు.

‘పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు. భవిష్యత్ తరాల కోసం ముందు చూపుతోనే పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని స్పీకర్​ పేర్కొన్నారు. కోటి వృక్షార్చన లో భాగంగా రాష్ట్రంలోని గ్రామ గ్రామాన ఒక గంటలోనే కోటి మొక్కలు నాటడం అద్బుత కార్యక్రమం అని స్పీకర్​ పోచారం కొనియాడారు. సీఎం కేసీఆర్​ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలోని రైతులు అప్పుల ఊబీ నుంచి బయటపడి సంతోషంగా ఉన్నారని’స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి​ వెల్లడించారు. అనంతరం 67 కిలోల భారీ కేక్ ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేకేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి లు కట్ చేశారు.

అనంతరం మంత్రి తలసాని ఆధ్వర్యంలో జలవిహార్ లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్ లు మొక్కలను నాటారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కోటి మొక్కలు నాటి సీఎం కేసీఆర్​కు కానుకగా అందిస్తామని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ లు నవీన్ రావు, శంభీపూర్ రాజు, బోడకుంటి వెంకటేశ్వర్లు, బస్వరాజు సారయ్య, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్, వివేకానంద్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపినాథ్​, సుదీర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్​చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ మేయర్ శ్రీ తీగల కృష్ణారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.