సైకిల్ పై నగరంలో పర్యటించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి ఖమ్మం నగరంలో సైకిల్ పై పర్యటించారు. సైకిల్ పై పర్యటించి ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, పీఎస్ఆర్ రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, కాల్వఒడ్డు, జూబ్లీపురా, మయూరి సెంటర్, బస్ డిపో రోడ్, సరితా క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, నూతన మున్సిపల్ భవనం వరకు రోడ్డు కు ఇరు వైపులా జరుగుతున్న సైడు కాల్వ పనులు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైప్ లైన్ పనులు, పారిశుధ్యం పనులను పరిశీలించారు.

ads

పలు చోట్ల పనుల ఆలస్యం పట్ల మంత్రి అధికారులను నిలదీశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని హెచ్చరించారు. పనుల్లో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవిన్యూ తదితర శాఖ అధికారులు ఉన్నారు.