హిమేశ్​ రాష్ట్రానికి గర్వకారణం

బాలపురస్కార్-2021 అవార్డు గ్రహీతకు మంత్రి సత్యవతి సన్మానం హైదరాబాద్​ : బాల పురస్కార్​ అవార్డు గ్రహీత చదలవాడ హిమేష్​ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి సత్యవతిరాథోడ్​ అన్నారు. సోమవారం మంత్రి తన నివాసంలో హిమేశ్​ను సత్కరించారు. ఆల్జీమర్స్ వ్యాధి ఉన్నవారి ఆరోగ్య పరిరక్షణకు హిమేష్​ స్మార్ట్ వాచ్ కనిపెట్టారు. రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు – 2021 గెలుచుకున్నాడు. చదవలవాడ హిమేశ్​ది మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా. అత్యుత్తమ ప్రతిభ చూపి, బాలపురస్కార్​ అవార్డు పొందినందుకు మంత్రి అభినందనలు తెలిపారు.

హిమేష్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. హిమేష్ ఈ స్థాయికి రావడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా మంత్రి అభినందనలు తెలిపారు. హిమేష్ కు విద్యలోగానీ, ఇతర పరిశోధనల్లోగానీ ఎలాంటి సాయం కావాలన్న చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తన ఇంట్లో అమ్మమ్మకు ఆల్జీమర్స్ ఉన్నదని ఆమె పరిరక్షణ కోసం రిస్ట్ బ్యాండ్ ను కనిపెట్టారు. హిమేష్ మిగిలిన బాలలకు స్ఫూర్తిదాయకమన్నారు. హిమేష్ ఇదే స్ఫూర్తితో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి సత్యవతి రాథోడ్​ ఆకాంక్షించారు.