లోకల్ బాడీ ఎన్నికలపై మాట మార్చిన మంత్రి సీతక్క
వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ !
రెండు మూడ్రోజుల్లో రైతు భరోసా డబ్బులు ఇస్తామన్న సీతక్క
పార్టీ కార్యకర్తలకు సీతక్క దిశా నిర్దేశం
మహబూబాబాద్ పర్యటనలో మంత్రి సీతక్క
కార్యకర్తల సమావేశంలో మాట మార్చిన సీతక్క
ఎన్నికలెప్పుడో వారంలో తెలుస్తుందన్న మంత్రి
వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క ఓ క్లారిటీ ఇచ్చారు. వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీతక్క ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
రెండు మూడ్రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులిస్తామని చెప్పారు. అధికారులు ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల లోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు సీతక్క.
అయితే ఇది కాస్త మీడియాలో వార్తగా వైరల్ అయ్యే సరికి సీతక్క మాట మార్చింది. మీకు అట్ల అర్ధమయ్యిందా అంటూ మాట మార్చేసింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే కాదని చెప్పింది. మొదటగా శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల అంతర్గత సమావేశంలో వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పింది.
అయితే ఆమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో యూ టర్న్ తీసుకుంది. వారం పది రోజుల్లో పంచాయతీ ఎన్నికలపై ఓ క్లారిటీ వస్తుందని మాత్రమే చెప్పానని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చినట్లు సమాచారం.
గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గత సంవత్సరం 2024 ఫిబ్రవరిలోనే ముగిసింది. దాదాపు యేడాదిన్నరగా ఎన్నికలు జరుగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1600 కోట్లకు పైగా ఆగిపోయాయి. పాలకవర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు గత సంవత్సరం జులై మొదటి వారంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు ఏప్రిల్ లోనే ముగిసాయి.
ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో జులైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను 2024లోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది.
దీనికోసం సమగ్ర కుల గణన సర్వే చేపట్టింది. అనంతరం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది.