27న చేపల విక్రయ వాహనాల పంపిణీ

హైదరాబాద్​ : ప్రజలకు పరిశుభ్రమైన చేపలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మత్య్స శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన 105 సంచార చేపల విక్రయ వాహనాలు (మొబైల్ ఫిష్ ఔట్ లెట్ ) లను ఈ నెల 27 న మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేయనున్నారు. హెచ్​ఎండీఏ గ్రౌండ్ లో ( ఐ మ్యాక్స్ దియేటర్ ప్రక్కన) లబ్దిదారులకు వాహనాలు అందజేసి మంత్రి ప్రారంభిస్తారు. జీహెచ్​ఎంసీ, 29 జిల్లాలలో 150 వాహనాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ads

ముందుగా జీహెచ్​ఎంసీ పరిధిలో 61,29 జిల్లాలకు సంబంధించి 44 వాహనాలను లబ్ధిదారులకు అందజేస్తారు. ఒక్కో వాహనం విలువ రూ. 10 లక్షల కాగా రూ .6 లక్షలను ప్రభుత్వం, ఎన్​ఎఫ్​డీబీ లు భరించనున్నాయి. మరో 4 లక్షలు లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. స్వయం సహాయక సంఘాల మహిళలను అర్హులుగా గుర్తించి ఈ వాహనాలను ప్రభుత్వం అందజేస్తుంది. ఒకవైపు చేపలు, మరో వైపు చేప వంటకాలను విక్రయించుకోనే విధంగా ఈ వాహనాలను తయారు చేశారు. ఈ వాహనాల వల్ల ప్రజల ఇంటి వద్దకే వెళ్లి పరిశుభ్రమైన చేపలను సరసమైన ధరలకు అందించనున్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు.