పోతన పేరుతో ఆధునిక కళాక్షేత్రం

జనగామ జిల్లా : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు శుక్రవారం జిల్లాలోని పాలకుర్తి మండలం లోని బమ్మెర లో ఉన్న ప్రముఖ కవి పోతన సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా పోతన సమాధికి ఘనంగా నివాళులర్పించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బమ్మెర లో పోతన మాత్యులు పేరు తో ఒక ఆధునిక కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఆడిటోరియం, అక్షరాభ్యాస కేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే పోతన రచించిన గ్రంథాలను, వారి జ్ఞాపకాలను భద్రపరించేందుకు గ్యాలరీ లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. పోతన మాత్యుల కళాక్షేత్రాన్ని వచ్చే 6 నెలల్లో పూర్తి చేయాలని మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, ఎర్రబెల్లి దయాకర్​రావు అధికారులను ఆదేశించారు.