ఆమె మహిళనా..రౌడీనా !

వరంగల్ అర్బన్ జిల్లా : ఆమె మహిళా నాయకురాలా, రౌడీనా అంటూ వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మపై పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణానికై చేస్తున్న జనజాగరణ, నిధి సేకరణ విషయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంరేపిన విషయం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని ఎమ్మెల్యే చల్లా ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేశారు. ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు హంటర్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ అలజడితో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయ మంటలు రగులుకున్నాయి. దీంతో నిన్న బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు, పలువురు బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రోజు 14 రోజుల పాటు రిమాండ్ కు పంపించారు.

అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను, బీజేపీ కార్యాలయంపై ప్రతిదాడులను నిరసిస్తూ బీజేపీ మంగళవారం రాష్ట్రంలో నిరసనలకు పిలుపునిచ్చింది. ఇదే క్రమంలో బీజేపీ దాడులను ఖండిస్తూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బీజేపీ తీరును ఎండగట్టారు. మరోవైపు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడిని ఖండిస్తూ సోమవారం రోజు మంత్రి సత్యవతి రాథోడ్ బీజేపీని హెచ్చరించింది. చల్లా ధర్మారెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా శ్రేణులపై విమర్శణాస్త్రాలు విసిరారు.అయోధ్య రామమందిర నిర్మాణంపై చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని చెప్పిన మంత్రి సత్యవతి రాథోడ్ బీజేపీ దాడులను తీవ్రంగా ఖండించారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దాడులకు దిగే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీది కాదని అన్నారు. పోలీసులు ఉండగానే తన ఇంటి ఉంది ఉండి బీజేపీ కార్యకర్తలను ఉసిగొల్పి తన ఇంటిపై దాడి చేయించిన నీతిమాలిన సంస్కృతి బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మకే చెందుతుందని ఎమ్మెల్యే చల్లా ఆరోపించారు. ఇంట్లో నా కుటుంబం ఉండగా, ఇంటిపై రాళ్లతో, కర్రలతో దాడి చేయించిన రావు పద్మ , టీఆర్ఎస్ ప్రతిదాడులను ఖండించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తన ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడులు చేస్తే, ప్రతిగా బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఖండించారు. దాడులకు ఉసిగొల్పే క్యారెక్టర్ మాకు లేదని, ప్రత్యక్ష దాడులు చేయించే సంస్కృతి బీజేపీ జిల్లా అధ్యక్షురాలికి ఉందని రావు పద్మపై చల్లా ధర్మారెడ్డి విమర్శలు చేశారు. అసలు ఆమె మహిళనా, రౌడీనా అంటూ తేల్చుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఉందని ఆయన కోరారు.