నెత్తిన మూటతో 2 కి.మీ. నడిచిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లా : ఎలాంటి విపత్కర పరిస్థితులైనా నేనున్నానంటూ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్. కరోనా విపత్కర కాలం మొదలైన నాటి నుంచి తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతీ ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర సరుకులను అందించడమే కాకుండా, వారి ఆరోగ్య పరిరక్షణ తన వంతు సాయం అందిస్తున్నారు. జనారణ్యంలో కొండలు కోనలు దాటుతూ, వాగులు వంకలు దాటుతూ సాధారణ, గిరిజన ప్రాంత ప్రజలకు తన చేయూతను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల పంచాయతీ పరిధిలోని రాపట్ల గొత్తికోయగూడెం వెళ్లాలని ఎమ్మెల్యే సీతక్క భావించారు. రాపట్లకు రోడ్డు మార్గం లేకపోవడంతో లింగాల నుంచి నెత్తిన సరుకుల మూటలతో సుమారు 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఆమె అక్కడికి చేరుకున్నారు. 16 కుటుంబాల చిన్నారులకు బట్టలు, దుప్పట్లు, బియ్యం, కూరగాయలు అందజేశారు.

ads

మరోవైపు లాక్‌డౌన్ నేపథ్యంలో గోవిందరావుపేట మండలం పస్రా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ సిబ్బందికి ఎమ్మెల్యే సీతక్క భోజనాలు అందజేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలను ఎమ్మెల్యే సీతక్క ప్రశంసించారు.