ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు మరిన్ని చర్యలు

హైదరాబాద్​: ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు మరిన్నిచర్యలను చేపట్టనున్నట్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మార్చడం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, రోడ్డు, రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మానవ వనరుల అభివృద్ధిని వేగవంతం చేయడం, వైద్య, ఆరోగ్య, న్యూట్రిషన్ రంగాల్లో మౌలిక మార్పులకు ప్రాధాన్యం ఇవ్వడం తదితర అభివృద్ధి అంశాలపై అన్ని రాష్ట్రాల సీఎస్​లతో ఈ వీడియో కాన్ఫ రెన్స్ ను నిర్వహించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ నిర్వహించిన వీడియో కాన్ఫ రెన్స్ లో బీఆర్​కేఆర్​ భవన్​లో సీఎస్​ సోమేశ్​కుమార్​ పాల్గొన్నారు.

ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ నెల 20న జరగనున్న నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం సందర్భంగా ప్రివ్యూ మీటింగ్ గా ఈ కాన్ఫరెన్స్ చేపట్టారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, కొవిడ్​ను అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా సమర్దవంతంగా ఎదుర్కొన్నందుకు అభినందనలు తెలిపారు.

ఇంకా ఈ సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కే .రామకృష్ణారావు, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి బీ జనార్దన్ రెడ్డి, మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య ,సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిత్తల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన, ప్రణాళికా శాఖ సంచాలకులు షేక్ మీరా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.