హెచ్‎సీయూకు పీవీ పేరు: ఎంపీ

న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ డిమాండ్ చేశాడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని, ఓ రహదారికి ఆయన పేరును పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీ బండ ప్రకాష్ మాట్లాడారు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈవిషయంపై మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని ఎంపీ తెలిపారు. టీకా పరీక్ష కేంద్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.

తెలంగాణకు ఐఐఎం, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ , నేషనల్ ఇన్‎స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను మంజూరు చేయాలని ఎంపీ బండా ప్రకాష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆరేండ్ల కాలంలో ఐటీ ఎగుమతులు బాగా పెరిగాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. కేంద్రం ప్రకటించిన మెగా టెక్స్‎టైల్స్ స్కీంలో వరంగల్‎లో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్‎టైల్స్ పార్కును చేర్చాలన్నారు. ఈ పార్కు నిర్మాణం కోసం బడ్జెట్ లో రాష్ట్రం రూ.300 కోట్లు కేటాయించిందన్నారు. వీలైనంత త్వరగా విభజన చట్టం హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కూడా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఎంపీ బండా ప్రకాష్ తెలిపారు. 2016లో ఇంటింటికి తాగునీటీ పథకం తెలంగాణలో ప్రారంభమైందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. తెలంగాణలో 98.7 శాతం ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని ఎంపీ బండా ప్రకాష్ చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తుందని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి సాగుకు పుష్కలంగా నీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. రైతుబంధు, రైతు భీమా పథకాలను దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతు బంధు కింద ప్రతీ ఎకరాకు రూ.వేల చొప్పున సాయం చేస్తున్నామని, ఏ కారణం చేత రైతు చనిపోయినా, రైతు భీమా కింద ఐదు రోజుల్లో రూ.5లక్షలు వారి ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. రైతు భీమా పథకం 32.73 లక్షల పట్టాదార్లకు వర్తిస్తుందని ఎంపీ తెలిపారు.