ఎంపీ మోహన్ దెల్కర్ ఆత్మహత్య..!

ముంబై : దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దెల్కర్ ముంబై మెరైన్ డ్రైవ్ లోని ఓ హోటల్ రూంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హోటల్ వద్దకు చేరుకున్నారు. ఎంపీ మోహన్ దెల్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హోటల్ రూంలో పోలీసులు సూసైడ్ నోట్‎ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్ గుజరాతీలో రాసి ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రాథమిక విచారణ ప్రకారం ఎంపీ మోహన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ పోలీసులు ఇంకా ఆ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 58 యేళ్ల మోహన్ దెల్కర్‎కు భార్య కలాబెన్, ఇద్దరు పిల్లలు అభినవ్, దివిత ఉన్నారు. గత లోక్‎సభ ఎన్నికల్లో దాద్రానగర్ హవేలీ లోక్‎సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. గతంలో కూడా పలుమార్లు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్‎లో కీలక నేతగా ఉన్న మోహన్, 2019 వరకు దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 లోక్‎సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.