సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం

హైదరాబాద్​: సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని ఎంపీపీలు అన్నారు. ఎంపీపీలకు మండల పర్యవేక్షణ అధికారాలు ఇవ్వడం పట్ల ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ సంతోషాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో పంచుకున్నారు. బుధవారం మంత్రుల అధికార నివాసంలో వారు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తమకు మానసికంగా ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

14 వ ఆర్థిక సంఘం నిర్ణయం వల్ల ఎలాంటి అధికారాలు లేని కారణంగా ఎంపీపీలు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. మండలంలో పరిపాలనాపరంగా పర్యవేక్షణకు కూడా అధికారాలు లేకపోవడంతో ఇక్కట్లు తప్పలేదని ఎంపీపీల ఫోరం ప్రతినిధులు ఆవేదన చెందారు. కాగా 15 వ ఆర్థిక సంఘం ద్వారా తమకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు ఎంపీపీలు. మండల పర్యవేక్షణ బాధ్యతలను ఎంపీపీలకు, జిల్లా పర్యవేక్షణను జిల్లా పరిషత్ చైర్మన్ లకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకం అని వారు వినోద్ కుమార్ తో ఆనందం వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో జెడ్పీ, మండల స్కూల్స్ ను పర్యవేక్షించే బాధ్యతలను కూడా తమకు అప్పగించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీల ఫోరం ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే మండల పరిషత్ లకు నాలుగు విడతలుగా తలసరి గ్రాంట్ ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలానికి కనీసం రూ.కోటి నిధులు మంజూరు చేయాలని, 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసి మార్గదర్శకాలను సరళీకరణ చేయాలని అభ్యర్థించారు. మండలాలకు సీనరేజి గ్రాంట్స్ రెగ్యులర్​గా విడుదల చేయాలని కోరారు. ఎంపీ, ఎమ్మెల్యేల కోటా కింద చేపట్టే అభివృద్ధి పనులకు జీపీ తీర్మానం అవసరం లేకుండా నిబంధనలు సవరించాలన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు విధిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీల ఫోరం ఆ వినతి పత్రంలో విజ్ఞప్తి చేసింది.

వినోద్ కుమార్ తో సమావేశమైన వారిలో ఎంపీపీల ప్రతినిధులు చీర శ్రీశైలం, చిలుక రాజేందర్, కొత్త వనిత శ్రీనివాస్ రెడ్డి, జక్కుల అనిత రమేష్, మాలోతు లక్ష్మీ భీలు నాయక్, తదితరులు ఉన్నారు.