మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు

అమరావతి: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు షెడ్యూల్‎ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 10న పోలింగ్ జరుగనుండగా, అదే నెల 14న ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజుల పాటు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియ మార్చి 2న ప్రారంభమై 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.

గత సంవత్సరం నిలిచిపోయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియను కొనసాగించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలకు గత యేడాది మార్చి 11న నోటిఫికేషన్ విడుదలయ్యింది. మార్చి 11, 12 తేదీల్లో నామినేషన్లు వేశారు. అయితే కరోనా నేపథ్యంలో మార్చి 16న నామినేషన్ల ఉపసంహరణ రోజే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. దీంతో తాజాగా మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది.