
హైదరాబాద్ : కార్యదర్శులు మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. కొత్తగా నియామకమైన పంచాయతీ కార్యదర్శుల వేతనాలను, ప్రస్తుతం పని చేస్తున్న కార్యదర్శుల వేతనాలకు సమానంగా పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా నియామకమైన 9వేల 355 మంది కార్యదర్శులకు సమాన పనికి సమాన వేతనంగా ఇప్పుడున్న జీతాలకు రెట్టింపు కంటే ఎక్కువ జీతాలు వస్తాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
గత కొంత కాలంగా కొత్త గ్రామ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్న డిమాండ్ సీఎం కేసీఆర్ హామీతో నెరవేరిందన్నారు. ప్రొబేషనరీ పీరియడ్ ని 4 ఏళ్లకు పెంచడానికి గల కారణాలను కూడా సీఎం తెలిపారన్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతానికి కార్యదర్శుల పనితనమే కారణమన్నారు.
నర్సరీలు, డంపు యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. నిరంతరం పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నందున, పారిశుద్ధ్యం కూడా అలాగే జరగాలని ఆదేశించారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పారిశుధ్యంలో రాజీ లేకుండా గతంలో మాదిరిగానే కరోనా కట్టడికి పూర్తి క్రమశిక్షణతో పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు.