కేరళ : ఆర్యా రాజేంద్రన్ ఈ అమ్మాయి ఇప్పడు ఫేమస్ అయింది. దేశమంతా ప్రజెంట్ ఈమె పేరే వినబడుతోంది. ఇందుకు కారణం ఈ 21 ఏళ్ల బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని తొలి ఎన్నికలోనే విజయం సాధించారు. కేరళ రాజధాని తిరువనంతపురానికి మేయర్‌గా ఆమె పేరు దాదాపు ఖరారయింది. అంతేకాదు దేశంలోనే అతి చిన్న వయస్సు ఉన్న మేయర్‌గా ఆమె చరిత్రకు ఎక్కబోతున్నారు. నగర పాలనలో తనదైన ముద్ర కనబర్చడానికి రెడీ అవుతున్న ఈ యువతరం ప్రతినిధి చెబుతున్న సంగతులివి. ‘‘నాకు రాజకీయాలపై ఇష్టం ఏర్పడడానికి కారణం నా ఫ్యామిలీనే. మా తండ్రి కేఎం రాజేంద్రన్‌తో పాటు మా అమ్మ శ్రీలత, మా బ్రదర్ అరవింద్ అందరూ సీపీఎం సభ్యులే. ఇంట్లో ఎప్పుడూ రాజకీయపరమైన చర్చలు జరుగుతూ ఉండేవి. ‘మాది పార్టీ కుటుంబం’ అని మా నాన్న గర్వంగా చెబుతూ ఉండేవారు.
అలా చిన్నతనం నుంచే నా జీవితంలో రాజకీయాలు ఒక భాగం అయ్యాయి. తిరువనంతపురంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో మా కుటుంబం ఒకటి. నాన్న ఎలక్ట్రీషియన్. అమ్మ ఎల్ఐసీ ఏజెంట్. నన్నూ, అన్నయ్యనూ బాగా చదివించాలని మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన మా బ్రదర్ జాబ్ కోసం మధ్యప్రాచ్యం వెళ్లాడు. ప్రస్తుతం ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాం. నెలకు ఆరువేల రెంటు చెల్లిస్తున్నాం. ఇన్ని ఇబ్బందులున్నా రాజకీయాల్లోకి వెళ్లాలనే నా కోరికను మా తల్లిదండ్రులు ఎప్పుడూ కాదనలేదు. అయిదో క్లాస్ చదువుతున్నప్పు డే సీపీఎంతో నాకు అనుబంధం ఏర్పడింది. పిల్లల కోసం ‘బాలసంఘం’పేరుతో ఒక సంస్థను ఆ పార్టీ నిర్వహిస్తోంది. దానిలో నంబర్‌గా చేరాను.
సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి, సొంత వ్యక్తిత్వాన్ని ఎలా ఏర్పరచుకోవాలి ! ఇలా అనేక విషయాలు అక్కడ తెలుసుకున్నాను. నాదైన స్వతంత్ర దృక్పథం ఏర్పరచుకోవడంలో బాలసంఘం పాత్ర ఎంతో ఉంది. ఆ తరువాత సంఘం జిల్లా అధ్యక్షురాలిగా పని చేశాను. రెండేళ్ల నుంచీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను. ‘బాల సంఘం’లో నేను క్రియాశీలంగా ఉండడాన్ని సీపీఎం అధిష్టానం గుర్తించింది. సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎ్‌ఫఐ)లో స్థానం కల్పించింది. ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కమిటీలో కూడా పని చేశాను. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటించే అవకాశం దొరికింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పై అవగాహన కలిగింది. నా మీద నమ్మకంతో తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా పార్టీ పెద్దలు అడిగారు. ముదవన్గల్ వార్డు నుంచి బరిలో నిలుచున్నాను.
పాలిటిక్స్ ఎందుకు అన్నారు…
ఆల్ సెయింట్స్ కాలేజీలో ప్రజెంట్ నేను బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. మా అధ్యాపకులు, తోటి విద్యార్థులు నాకు సంపూర్ణ మద్దతునిచ్చారు. అయితే కొందరు సానుకూలంగా స్పందించినా, మరికొందరు చదువుకుంటున్న సమయంలో రాజకీయాలు ఎందుకన్నారు. విద్యార్థి రాజకీయాలను నేను గట్టిగా సమర్థిస్తాను. కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. రాజకీయాలతో పాటు స్టడీస్‌పై కూడా అంతే దృష్టి పెట్టాలని ఎలక్షన్ ప్రచారం చేస్తున్నప్పుడు చాలామంది తనకు సూచించారు. అలాగేనని వారికి మాట ఇచ్చాను. ఈ ఎన్నికలను నేను ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కొన్నాను. వయసు తక్కువ, ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేమి ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలు నన్ను కార్పొరేటర్‌గా ఎన్నకున్నారు. మా పార్టీకి కూడా మెజార్టీ సీట్లు రావడంతో మేయర్ అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది. మేయర్ పదవికి అభ్యర్థిగా నా పేరును సీపీఎం జిల్లా కార్యదర్శివర్గం సిఫార్సు చేసింది.
ప్రజలు మారాలి
మా నాన్నే నాకు తొలి రాజకీయ గురువు. ‘వ్యక్తి కన్నా పార్టీయే ముఖ్యం’అని ఆయన తరచూ చెబుతూ ఉంటారు. కాబట్టి పార్టీ నిర్ణయమే శిరోధార్యం. ఏ బాధ్యత అప్పగించినా ఆనందంగా స్వీకరిస్తాను. మేయర్ అయితే చేయాలనుకుంటున్న పనులు ఎన్నో ఉన్నాయి. మాది అందమైన నగరం. కానీ నగర పరిశుభ్రత విషయంలో ప్రజల వైఖరి మారాలి. కొందరు ఇప్పటికీ రోడ్ల మీద చెత్త వేస్తున్నారు. దీనివల్ల కలిగే నష్టాలపై వారికి వివరిస్తాను. శాస్త్రీయమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను. ప్రజా సంక్షేమం కోసం పని చేయడం నా స్టడీస్ కొనసాగించడం… ఇప్పుడు ఇవే నా ప్రాధామ్యాలు. క్రిస్టమస్ ముందు జరిగే మూడు పరీక్షలకు హాజరుకాలేకపోయాను. మిగిలినవి రాయడానికి రెడీ అవుతున్నాను.
శక్తి వంచన లేకుండా కృషి చేస్తా
నేను సీఎం పినరయి విజయన్ అభిమానిని. అలాగే రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి కేకే శైలజను చూసి ఎంతో స్ఫూర్తి పొందుతున్నాను. సంక్షోభ సమయాల్లో వారు వ్యవహరించే తీరు నన్ను ఎంతో ఆకట్టుకుంటుంది. వ్యక్తిగత అభిరుచుల విషయానికొస్తే… నాకు మూవీస్ ఇష్టం. నేను మోహన్‌లాల్ అభిమానిని. అన్నట్టు మోహన్‌లాల్ పూర్వీకుల ఇల్లు మా వార్డులోనే ఉంది. నేను విజయం సాధించగానే ఆయన ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడం ఆనందంగా అనిపించింది. ఆరోగ్యం, విద్య , వీటికి ప్రాధాన్యామిస్తూ, ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా ముందున్న ప్రధాన కర్తవ్యం. అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.’