నా ఓటు బ్యాంక్ పదిలం..గెలుపు నాదే : కోదండరాం

వరంగల్ అర్బన్ జిల్లా : తెలంగాణ వచ్చేదాక పోరాటం ఒక ఎత్తు అయితే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధిపై పోరాటం మరొక ఎత్తు అని నాడు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొ. ఎం. కోదండరాం అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడిగా, తెలంగాణ జేఏసీ అధ్యక్షునిగా, మిలియన్ మార్చ్ నిర్వహించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల జై తెలంగాణ నినాదాన్ని ప్రపంచాన్ని తెలియచేసిన ఉద్యమకారుడిగా , తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తనకు ఉద్యమకారులు, పట్టభద్రుల ఓటు బ్యాంక్ పదిలంగానే ఉందని ప్రొ. కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో కోదండరాం పాల్గొన్నారు. మార్చి 14న జరుగబోయే వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణ జన సమితి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టభద్రులు తననెంతగానో ఆదరిస్తున్నారని ప్రొ.కోదండరాం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తాను సాధించుకున్న తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన కొనసాగడం లేదని ప్రొ.కోదండరాం ‎ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నారని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. అమరుల త్యాగాలపై నిలిచిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యమకారులను అవహేళన చేయడం బాధాకరమని అన్నారు. అదే క్రమంలో తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తలకు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారికి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం సిగ్గుచేటన్నారు.

ads

తెలంగాణలో పాలన మార్పుకు మరో ఉద్యమం తప్పదని ప్రొ. కోదండరాం అన్నారు. రాష్ట్రంలో ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగుల నమ్మకాలను ఈ ప్రభుత్వం వొమ్ము చేసిందని విమర్శించారు.
ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పీఆర్‎సీని పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సింది పోయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పీఆర్సీ ‎ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం బాధాకరమన్నారు.
రాష్ట్రంలో ఇష్టానుసారంగా విద్యను ఒక వ్యాపారంగా మార్చారు, కేజీ టూ పీజీ విద్య వ్యాపారమైంది, ఇసుక దందాలు, భూముల ఆక్రమణలు పేట్రేగిపోతున్నాయని ఆరోపించారు. 2014 నుంచి 2015 మధ్య తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలపై ఒక లిస్ట్ తీయాలని కోదండరాం వరంగల్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం కల్పించని ఈ ప్రభుత్వం నిరుద్యోగులు, ప్రజలు కలలు కన్న ఆశలపై నీళ్లు చల్లారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందులో రెగ్యులరైజేషన్, ప్రమోషన్లు ఉద్యోగ భర్తీలోనికి రావన్న విషయాన్ని గమనించాలని కోదండరాం పేర్కొన్నారు.

కేవలం 71 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, ఇంకా మిగిలిన లక్షా ఎనభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనని, మేం సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నామని కోదండరాం పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేస్తామని సీఎం చెప్పిన మాటలు ఇప్పటికీ అమలు కాలేదని, రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో పేదల నుండి గుంజు కున్న భూములలో ఒక్క పరిశ్రమ కూడా కట్టలేదని ఆయన అన్నారు. ఇక ప్రపంచమే విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న కరోనా లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలకు సాయం చేయాల్సిందిపోయి, చందాలు వసూళ్లు చేయాలని ఆయన విమర్శించారు.

తెలంగాణ ఉద్యమంలో నలుగురితో కలిసి పోయిన కేసీఆర్ , ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అధికార దాహంతో ఒంటెద్దు పోకడ పోతున్నాడని కోదండరాం ఫైర్ అయ్యారు. ఎప్పటికప్పుడు క్యాబినెట్ సమావేశం అవుతుంది, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తాయి, కానీ ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. కొట్లాది సాధించుకున్న తెలంగాణ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మార్పుకు అనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండటం కోసం మరో ఉద్యమం చేయడం ఖాయమని ఆయన అన్నారు. నోటుకు ఓటు నడుస్తున్న ఈ కాలంలో నోటు ఇవ్వకుండా ఓటు అడిగిన వారికే పట్టభద్రులు పట్టం కడతారని , ఖచ్ఛితంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.

ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ప్రెస్ క్లబ్ కార్యదర్శి వెంకట్, టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ లెనిన్, ఐజేయూ నాయకులు, గాడిపెళ్లి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ గౌడ్, ఐజేయూ జిల్లా ప్రధాన కార్యవర్శి కంకణాల సంతోష్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గోకారం సుధీర్, సహాయ కార్యదర్శి కేసనపల్లి రంజిత్ కుమార్, వరంగల్‎టైమ్స్ ఎడిటర్ సోని నాగబెల్లి, ఇన్‎పుట్ ఎడిటర్ రాజేంద్రప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు, ఫోటో మరియు వీడియో జర్నలిస్టులు , తదితరులు పాల్గొన్నారు.