లొంగిపోయిన నక్సలైట్లు

దంతెవాడ : ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ఫలిస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 1600 మంది నక్సల్స్ ఉండగా, స్థానిక గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లు వేస్తూ వారందరినీ జనజీవన స్రవంతిలో చేరాలంటూ పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దంతెవాడ జిల్లాలోని 12 మంది మహిళా దళ సభ్యులతో సహా 24 మంది నక్సలైట్లు లొంగిపోయారు. మంగళవారం రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా దక్షిణ బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న నక్సల్స్ లొంగిపోయేందుకు తమను ఆశ్రయించారని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. ఇందులో ముగ్గురి తలలపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉందని పేర్కొన్నారు. మావోయిస్టు భావజాలంపై విరక్తి చెందారని ఎస్పీ చెప్పారు.

జిల్లా పోలీసులు చేపట్టిన ‘లాన్ వర్రటు’ ( మీఇంటికి / గ్రామాలకు తిరిగి రండి ) పునరావాస ప్రచారంతో హింసామార్గాన్ని వీడారన్నారు. లొంగిపోయిన వారిలో చిక్ పాల్-జంగిల్ పారా దండకారణ్యం అధిపతి ముచకి ( 31), సోధి (40), కమ్లి మాడ్కం (32) పై రూ.లక్ష చొప్పున రికార్డు ఉందన్నారు. లొంగిపోయిన నక్సల్స్ కింది స్థాయిలో క్రియాశీలకంగా పని చేస్తున్నారని, వారందరికీ తక్షణ సహాయంగా రూ.10వేలు అందచేసినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వం తరపున పునరావాసం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పించడంతో పాటు వివిధ విభాగాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గతేడాది జూన్ లో డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి 272 మంది నక్సల్స్ లొంగిపోయారని వివరించారు.