తొలి టీ20 కివీస్ వశం

క్రైస్ట్ చర్చ్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 53 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ బ్యాట్స్‎మెన్ దేవన్ కాన్‎వే 59 బంతుల్లో 99 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 6వ టీ20 మ్యాచ్ ఆడుతున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‎మెన్ కాన్‎వే సూపర్ ఆట తీరును ప్రదర్శించాడు. ఓ దశలో 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్‎కు భారీ స్కోర్‎ను అందించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసింది.

ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఆసీస్‎కు కివీస్ బౌలర్లు జలక్ ఇచ్చారు. టీం సౌథీ, ట్రెంట్ బౌల్ట్‎లు తొలి 5 ఓవర్లలోనే 4 వికెట్లు తీశారు. ఓ దశలో 19 పరుగులకే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. అయితే మరో 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 131 రన్స్‎కు ఆలౌటైంది. లెగ్ స్పిన్నర్ ఐస్ సోథి 4 వికెట్లు తీసుకున్నాడు. 5 మ్యాచ్‎ల సిరీస్‎లో గురువారం ఫిబ్రవరి 25న రెండవ టీ20 జరుగనున్నది. దేవన్ కాన్‎వే పుట్టింది దక్షిణాఫ్రికాలో , కానీ అతను ఆడుతోంది న్యూజిలాండ్‎కు. టీ 20ల్లో అతను సగటు 91గా ఉంది. గత మూడు ఇన్నింగ్స్‎లో 69 నాటౌట్, 93 నాటౌట్‎గా నిలిచాడు.