సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్

ads

హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్ కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. నేడు ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను నోముల భగత్, తల్లి నోముల లక్ష్మిలు కలిసారు. వీరితో పాటు మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రగతి భవన్ లో వీరితో సీఎం కేసీఆర్ కాసేపు చర్చించిన అనంతరం తెలంగాణభవన్ లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భగత్ కు బీఫామ్ అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , తేరా చిన్నపరెడ్డి , పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి , సాగర్ టీ ఆర్ ఎస్ నాయకులు ఎంసి కోటిరెడ్డి , అభ్యర్థి భగత్ తల్లి నోముల లక్ష్మి , కుటుంబ సభ్యులు ఉన్నారు. పార్టీ ప్రచారం కోసం రూ. 28 లక్షల చెక్ ను కూడా అందించారు. రేపు ఉదయం భగత్ తన నామినేషన్ వేయనున్నారు.

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ( టీఆర్ఎస్ సిట్టింగ్ ) గత యేడాది డిసెంబర్ లో ఆకస్మికంగా మరణించడంతో ఇక్కడ ఉపఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఉపఎన్నికలో అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నిలబడేందుకు సిద్ధమైనప్పటికీ, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని నిలబెట్టింది. బీజేపీ కంకణాల నివేదితను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ వారిని బుజ్జగించారు.

సాగర్ ఉపఎన్నికలో టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నేత కోటిరెడ్డిని సీఎం కేసీఆర్ బుజ్జగించారు. కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇక నోముల నర్సింహయ్య కొడుకు భగత్ కు టికెట్ ఖరారు చేసి బీఫాం అందచేశారు. బీఫాం తీసుకున్న నోముల భగత్ ను అన్ని వర్గాల వారు స్వాగతించారు.