ఓరుగల్లు సాక్షిగా జనసేన బలోపేతం

వరంగల్ అర్బన్ జిల్లా : ఉద్యమాల పోరుగడ్డ ఓరుగల్లు నుండి జనసేన పార్టీ బలోపేతానికి జనసైనికులు కృషి చేయాలని పార్టీ ఇంచార్జ్ శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. జనసైనికులు, నాయకులతో కలిసి మడికొండ నుండి 1000 బైకులతో ర్యాలీ చేపట్టారు. సుబేదారి, అదాలాత్ జంక్షన్ లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. నక్కలగుట్టలోని కాళోజి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఆకుల సుమన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కాకతీయుల పోరాట స్ఫూర్తితో జనసేన పార్టీ అణగారిన వర్గాల గొంతుగా పోరాడుతుందని వ్యాఖ్యానించారు. సామాన్య యువతకు రాజకీయ అవకాశం కల్పించి నాయకులుగా మారుస్తున్న ఘనత కేవలం జనసేన పార్టీ కి ఉందన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రవేశపెట్టిన అధినేత ఆశయాలు వరంగల్ నుండి ఆచరణలో చూపబోతున్నామని ఆకుల సుమన్ తెలిపారు.

ads

జనసేన అధినేత తెలంగాణ గడ్డ పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. మార్పు వెంటనే సాధ్యం కాకాపోయినా భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ పార్టీగా జనసేన ఉండబోతుందని ఆకుల సుమన్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అధినేతకు ఒక అవగాహన ఉందని తెలిపారు. సామాన్య యువకులను రాష్ట్ర నాయకులుగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు. అందుకు అన్ని విధాలుగా పార్టీ సంసిద్ధం అయిందని పేర్కొన్నారు. అన్ని డివిజన్, బూతు కమిటీలు సైతం పూర్తయినట్లు తెలిపారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపబోతుందని ధీమా వ్యక్తం చేసారు. అన్ని వర్గాల ప్రజలు జనసేన పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. పాలకుల వైఫల్యమే జనసేన పార్టీకి అస్త్రాలుగా మిగిలాయని, ఆ దిశగానే జనంలోకి వెళ్ళబోతున్నామని వెల్లడించారు. యువత పోరాడేందుకు సిద్దంగా ఉన్నారని వారికి జనసేన బాసటగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామారావు, రామ్ తల్లూరి, కావ్య, లక్ష్మణ్ గౌడ్, సంపత్నాయక్, రాజలింగం, జిల్లా నాయకులు రాజేందర్, వంశీ, గాదె పృథ్వి, బాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.