నేటి నుంచి ఓయూ హాస్టల్స్ బంద్

హైదరాబాద్ : కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా యూనివర్సిటీలకు కూడా అధికారులు సెలవులు ప్రకటించారు. అన్ని డిగ్రీ, పీజీ పరీక్షలను కూడా వాయిదా వేశారు.

ads

ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లను గురువారం మధ్యాహ్నం నుంచి మూసివేస్తున్నట్లు ఓయూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ప్రకటించారు. ఈ రోజు లంచ్ అనంతరం హాస్టళ్లను మూసివేయనున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు తమ హాస్టళ్లను ఖాళీ చేశారు. మిగిలిన విద్యార్థులను ఖాళీ చేయించేందుకు ఓయూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.