ప్రధాన నిందితుడి అరెస్టు

వరంగల్​ అర్బన్​ జిల్లా : జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం బస్టాప్ వద్ద జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిని పాలకుర్తి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఒక కారు, నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు సెల్ ఫోన్లు , రెండు పెప్పర్ స్ప్రే బాటిళ్లలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ సీపీ పీ ప్రమోద్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

గత నెల 23వ తేదీ ఆర్థరాత్రి పాలకుర్తి మండలం రాఘవపురం బస్టాప్​ వద్ద హత్య జరిగినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించినట్లు సీపీ ప్రమోద్​కుమార్​ తెలిపారు. మృతుడు మడత నర్సింహ(47) తండ్రి నర్సయ్య. హన్మకొండ కుమార్​ పల్లికి చెందిన వాడుగా గుర్తించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో నివాసం వుంటూ స్వంతంగా ఒక కారు కొని నడిపేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.

అయితే ఈ హత్యకేసుకు సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు పాలకుర్తి సర్కిల్ ఇన్​స్పెక్టర్ నేతృత్వంలో ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్యకు పాల్పడింది పాలకుర్తి మండల కేంద్రంలో కేబుల్ నెట్ వర్క్ నిర్వహిస్తున్న పరాంకుశం రోషన్ (20) తండ్రి ఉగేందర్‌స్వామిగా నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్టు సీపీ ప్రమోద్​కుమార్​ తెలిపారు.

నిందితుడి తండ్రి పాలకుర్తి మండల కేంద్రంలో కేబుల్ నెట్వర్క్ నిర్వహిస్తున్నారు. దీంతో వచ్చే ఆదాయంతో నిందితుడు రోషన్​ జల్సాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో తన జల్సాల కోసం అవసరమైన డబ్బును సులభంగా సంపాదించాలనే పథకం వేశాడు. ఇక 2018 నుంచి ఇప్పటి వరకు పాలకుర్తి మండల కేంద్రంలో నాలుగు బైక్స్​ను చోరీ చేశాడు. వాటిలో రెండింటిని అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు. మిగితా రెండు వాహనాలను వినియోగించుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. గత కొద్ది రోజుల క్రితం నిందితుడు దంతాలపల్లి ప్రాంతంలోను ఒక ద్విచక్రవాహనాన్ని చోరీ చేశారు. అయితే చోరీ చేసిన వాహనాలు అమ్మడానికి వాహనాల నంబర్ ప్లేట్​ను ఓఎల్​ఎక్స్​ లో పెట్టి ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ను వ్రాయించేవాడు. ఈ క్రమంలో నిందితుడి తండ్రికి కంటి చూపు సన్నగిల్లింది. దీంతో కేబుల్​ నెట్వర్క్​​ బాధ్యతలను రోషన్​ చేపట్టాడు. ఇలా కేబుల్​ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బు జల్సాలకు సరిపోక పోవడంతో ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఓ కారును కిరాయికి మాట్లాడుకుని మార్గ మధ్యలో డ్రైవర్​ను చంపి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయాలని పథకం వేశాడు రోషన్​. ఒక తెలుగు సీరియల్​లో చూపించినట్లుగా ఆన్​లైన్​లో రెండు పెప్పర్ స్ప్రేలు కొనుగోలు చేశాడు. గత నెల 23 తేదీన సాయంత్రం హన్మకొండ ప్రాంతానికి చేరుకుని ఒంటరిగా ఉన్న కారు డ్రైవర్లపై దృష్టి సారించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిట్ కళాశాల ప్రాంతంలో ప్రయాణికుల కోసం కారుతో ఎదురుచూస్తున్న మృతుడు నర్సింహ కారును నిందితుడు కిరాయికి మాట్లాడుకున్నాడు. బైక్​ను వడ్డేపల్లి క్రాస్ వద్ద వున్న కేబుల్ టీవీ కార్యాలయములో పార్కింగ్​ చేశాడు. కారులో రాత్రి 8.30 గంటలకు జనగామకు బయలుదేరి వెళ్లాడు. జనగామలో డ్రైవర్​ నర్సింహను పక్కదారి పట్టించేందుకు పలు ప్రయ్నతాలు చేశాడు. అక్కడే ఉన్న ఓ వైన్స్​లో మద్యం సేవించి మరో బాటిల్​ను కొనుగోలు చేశాడు. ‘ఇక్కడ పనికాలేదు కంప్యూటర్​ మదర్​బోర్డు నిమిత్తం పాలకుర్తికి పోవాల్సి ఉంది’ అని డ్రైవర్​కు చెప్పాడు నిందితుడు రోషన్​. అయితే అక్కడ కూడా హత్య చేసేదుకు సరైన అవకాశం దొరకలేదు. దీంతో తన మిత్రుడి ఇంటి వద్ద పని ఉందని చెప్పి అక్కడికి తీసుకెళ్లి కొద్దిసేపు అక్కడ స్టే చేశాడు. అనంతరం తిరిగి హన్మకొండకు బయలుదేరారు.

హన్మకొండ వస్తున్న క్రమంలో రాఘవపురం గ్రామ శివారులో బస్టాప్ వద్ద మూత్ర విసర్జన సాకుతో కారులో నుంచి దిగాడు నిందితుడు. అనంతరం కారులో కూర్చోని ఉన్న నర్సింహపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. నిర్ఘాంతపోయిన డ్రైవర్​ నిందితుడిపై తిరగబడ్డాడు. అయితే పలుమార్లు పెప్పర్​ స్ప్రేతో దాడి చేయడంతో నర్సింహ పక్కనే నీటికాలువలో పడ్డాడు. దీంతో నిందితుడు అక్కడే ఉన్న బండరాళ్లతో నర్సింహపై దాడి చేశారు. బలమైన దెబ్బలు తగలడంతో నర్సింహ అక్కడిక్కడే మృతిచెందాడు.

అనంతరం నిందితుడు రోషన్​ కారును తీసుకుని సీసీకెమెరాలకు చిక్కకుండా తన ఇంటికి వెళ్లాడు. ఇంటికి దూరంలో కారును నిలిపి తన రక్తం మరకలు, పెప్పర్ స్పెరే బాటిళ్లను తన ఇంటి వెనుక భాగం లో భద్రపర్చాడు. ఈ విషయాలను పోలీసుల విచారణలో అంగీకరించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ రమేష్, సీఐ చేరాలు, ఐటీ మరియు సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్లు రాఘవేందర్, జనార్ధన్ రెడ్డి, ఎస్సై సతీష్, అసిస్టెంట్ ఆనాటికల్ ఆఫీసర్ సల్మాన్, దేవరుప్పుల, కొడకండ్ల ఎస్సైలు కరుణాకర్ రావు, పవన కుమార్​ను సీపీ అభినందించారు.