4గురు నిందితులపై పీడీ యాక్ట్

వరంగల్ అర్బన్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్‎కు పాల్పడిన నలుగురు అంతర్ రాష్ట్ర నిందితులపై పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను కేయూసీ ఇన్‎స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి నిందితులకు పీడీ యాక్డ్ ఉత్తర్వులను వరంగల్ కేంద్ర కారాగారంలో అందచేశారు.

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‎కు పాల్పడుతున్న నిందితుల్లో సంగారెడ్డి జిల్లా కంగి మండలం, నాగూరు గ్రామం, పోమ్య తండాకు చెందిన పవర్ గణవతి, రంజిత్, గౌస్ ఖాన్ అలియాస్ బబ్లూ, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం తిమ్మాపూర్‎కు చెందిన దుగ్యాల వినయ్ కుమార్ లుగా సీపీ పి.ప్రమోద్ కుమార్ తెలిపారు.

పీడీ యాక్ట్ అందుకున్న ఈ నలుగురు నిందితులు గత సంవత్సరం నవంబర్ 21న ఆంధ్రప్రదేశ్‎ నుండి మహారాష్ట్రకు వరంగల్ మీదుగా గంజాయిని తరలిస్తున్న క్రమంలో వరంగల్ టాస్క్‎ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి నుండి రూ.20లక్షల విలువగల 200కిలోల గంజాయితో పాటు ఒక లారీ, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు గణపతిపై తెలంగాణ, మహరాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రైల్వే విభాగాలతో కలుపుకొని మొత్తం 8పైగా కేసులు వున్నట్లు సీపీ వెల్లడించారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసుకొని గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతూ యువతను మత్తుకు బానిసలుగా మార్చి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వారి పట్ల కఠినంగా వ్యవహించడంతో పాటు వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులను నమోదు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.