వైభవంగా పెద్దగట్టు జాతర

ads

సూర్యపేట జిల్లా : యాదవుల ఇలవేల్పు అయిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దూరజ్ పల్లి గుట్ట , సూర్యపేట పట్టణం అంత భక్తులతో ఇసుకేస్తే రాలనంతగా రద్దీ ఉంది. భక్తులు గంపల ప్రదర్శన చేస్తూ, బోనాలు, పోలు ముంతలు, పసుపు బియ్యం సమర్పిస్తున్నారు. గజ్జెల లాగులు ధరించి, కత్తులు, డప్పు వాయిద్యాలతో గుట్ట పైకి చేరుకుని స్వామి వార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు.

రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి అక్కడే మకాం వేసి దాదాపు రూ.10 కోట్లతో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కొవిడ్​ నేపథ్యంలో 1000 మంది మున్సిపల్​ సిబ్బందితో 24 గంటలు శానిటేషన్​ పనులు చేస్తున్నారు. అలాగే 24 గంటల వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. 10 వైద్య బృందాలు ఈ వైద్య సేవల్లో పాల్గొంటున్నాయి. నిరంతర విద్యుత్​, సాగునీటి సదుపాయాలు కల్పించారు. కొత్తగా స్వామి వారికి మహా మండపం నిర్మాణం చేపట్టారు. జాతరలో 40 సీసీ కెమెరాలు 1500 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత కల్పించారు.

జాతర నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లవలసిన వాహనాలను నార్కట్​పల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లించారు. జాతర ను 10 జోన్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించి కలెక్టర్​ పర్యవేక్షిస్తున్నారు. 300 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న ఈ జాతర ప్రతి రెండేళ్ల కోసారి నిర్వహిస్తారు. యాదవుల ఇలవేల్పు లింగమంతుల స్వామి, యలమంచిలమ్మ, గంగమ్మ, శివుడి సోదరి సౌడమ్మ లు, కొలువైన పెద్దగట్టు లో భక్తులు తమ సంపదలైన గొర్ల జీవాలను, తమను మృగాల నుంచి కాపాడాలని లింగమంతుల స్వామి ని యాదవులు మొక్కుకుంటారు.

సోమవారం రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్​ పెద్దగట్టు జాతరను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.